Ganesh Chaturthi 2022 : వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా…?

by Publicnowtelugu

హిందూ సంప్రదాయం ప్రకారం, మనలో ఎవరైనా ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలన్నా.. ఏదైనా శుభకార్యం చేయాలన్నా ముందుగా వినాయకుడికే పూజలు చేస్తుంటాం. ఎందుకంటే తొలి పూజను ఆదిదేవునికి చేయడం వల్ల ఎలాంటి విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుడు అనుగ్రహిస్తాడని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వినాయక చవితి పండుగ ఆగస్టు 31వ తేదీన అంటే బుధవారం నాడు వచ్చింది. వినాయక చవితిని గణేష్ చతుర్థి అని కూడా పిలుస్తారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే బొజ్జ గణపతికి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 108 పేర్లు ఉన్నాయట. ఆయా ప్రాంతాలను బట్టి వినాయకుని పేర్లు మారిపోతుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడు, గణపతి, లంబోదరుడు, ఏకదంతుడు, విఘ్నేశ్వరుడు, గణేశుడు, బొజ్జ గణపయ్య అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ సందర్భంగా బొజ్జ గణపతికి సంబంధించిన బోలెడన్ని పేర్లేంటి.. ఆ పేర్లు ఎలా వచ్చాయి.. వాటి వెనుక ఉన్న రహస్యాలేంటి అనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…

పురాణాల ప్రకారం వినాయకుడి అవతారాల్లో మొట్టమొదటి అవతారం వక్రతుండ. వక్రతుండుడు మత్సార అనే రాక్షసుడిపై విజయం సాధించి దేవతలు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడతాడు. వక్ర అంటే వక్రం అని తుండ అంటే తొండం అని అర్థం.

వినాయకుడికి ఒకటే దంతం ఉండటం వల్ల ఏకదంతం అనే పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. పరమేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన పరశురాముడిని వినాయకుడు అడ్డుకుంటాడు. దీంతో కోపంతో ఊగిపోయిన పరశురాముడు వినాయకుడికి చెందిన ఒక దంతాన్ని నాశనం చేశాడని పురాణాల్లో పేర్కొనబడింది. అప్పటి నుంచి వినాయకుడికి ఒకటే దంతం ఉండిపోయింది. అందుకే గణేశుడిని ఏకదంతుడిగా పిలుస్తారు.

ముద్గల పురాణాల ప్రకారం, లంబోదరుడు అంటే భారీ బొడ్డు ఉన్న వాడు అని అర్థం. ఈ అవతారంలో క్రోధాసురుడు అనే రాక్షాసుడిని సంహరించి దేవతలను కాపాడాడు. బ్రహ్మాండ పురాణం ప్రకారం, చంద్రుడిని వినాయకుడు దర్బిసాధువు శాపం నుంచి రక్షించాడు. గణపతి చిన్నతనంలో చంద్రుడిని నుదుటిపై తిలకంలా వాడేవాడు.

విఘ్నాలు అంటే అడ్డంకులు. నాశక అంటే నాశనం చేసేవాడు లేదా తొలగించేవాడు. ఇలా విఘ్నాలను తొలగించే నాయకుడు కాబట్టి వినాయకుడికి విఘ్ననాశక, విఘ్న నాయక అనే పేరు వచ్చింది. అందుకే విఘ్నేశ్వరుడిని పూజిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.

వినాయకుడు పార్వతీ దేవి సుపుత్రుడు. కాబట్టి గణేశునికి గౌరీ సుత అనే పేరు వచ్చింది. గౌరీ సుతుడు అంటే గౌరీ కుమారుడు అని అర్థం. వినాయకుడు అంటే అడ్డంకులన్నీ తొలగించే వాడని, నాయకత్వ లక్షణాలు కలవాడని, నాయకత్వం వహించేవాడని అర్థం.

ముద్గల పురాణాల ప్రకారం, వినాయకుడికి ఏనుగు తలను పెట్టడం వల్ల గజాననుడు అనే పేరు వచ్చింది. గజ అంటే ఏనుగు అని.. ఆనన్ అంటే ముఖం అని అర్థం. గజాననుడిని ఎనిమిదో అవతారంగా భావిస్తారు. ఏనుగు ముఖం ఉండటం వల్ల గణేశునికి గజాననుడు అనే పేరొచ్చింది.

వీటితో పాటు వినాయకుడికి ఇంకా బోలెడన్ని పేర్లు ఉన్నాయి. ఓంకారుడు(సరైన జీవితాన్ని ఇచ్చేవాడు), అద్వైత(ఏకైక వ్యక్తిత్వం కలవాడు), అవనీషుడు(లోకాన్ని ఏలేవాడు). ఇవే కాకుండా మరిన్ని పేర్లతోనూ బొజ్జ గణపయ్యను పిలుస్తారు. బాల గణపతి, లక్ష్మీ గణపతి, సిద్ధి గణపతి, శక్తి గణపతి, దుర్గా గణపతి, దుంధి గణపతి, యోగ గణపతి, వీర గణపతి అంటూ వినాయకుడిని ఏ పేరుతో పిలిచి కొలిచినా వారి కోరికలను కచ్చితంగా నెరవేరుస్తాడని చాలా మంది నమ్ముతారు.

Leave a Comment