నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుపొందిన కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సరసన ధోనీ నిలిచాడు. మరోవైపు ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ స్పందిస్తూ… కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఈ గెలుపు తన ఫ్యాన్స్ కు ఒక గిఫ్ట్ అని ధోనీ చెప్పాడు. అద్భుతమైన విజయం సాధించిన ఈ క్షణం తన రిటైర్మెంట్ ప్రకటనకు సరైన సమయమని… ‘థాంక్యూ వెరీ మచ్’ అంటూ తన రిటైర్మెంట్ ను సింపుల్ గా ప్రకటించగలనని అన్నాడు. అయితే, మరో తొమ్మిది నెలలు పాటు హార్డ్ వర్క్ చేస్తానని, మరో ఐపీఎల్ సీజన్ ఆడుతానని స్పష్టం చేశాడు. అయితే, తన శరీరం ఎంత మేరకు సహకరిస్తుందనేని కూడా చూడాలని అన్నాడు. తుది నిర్ణయం తీసుకోవడానికి మరో 6 నుంచి 7 నెలల సమయం పడుతుందని చెప్పాడు.
మరో ఐపీఎల్ ఆడటమనేది కష్టమైన పనే అయినప్పటికీ… తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ కోసం మరో ఐపీఎల్ ఆడాలనుకుంటున్నానని తెలిపాడు. ఐపీఎల్ లో తాము సాధించిన ప్రతి ట్రోఫీ ప్రత్యేకమైనదే అని చెప్పాడు. ధోనీ చేసిన ప్రకటనతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సీజన్ ఐపీఎల్ ధోనీకి చివరిదనే భావనతో సీఎస్కే జట్టు ఆడిన ప్రతి స్టేడియంకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అన్ని స్టాండ్స్ ధోనీకి మద్దతుగా పసుపురంగుతో నిండిపోయాయి.