జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు గురించి కసరత్తులు ప్రారంభిస్తున్న సమయం లో అమరావతి నుంచి ఏ కార్యాలయం తరలించకూడదు అంటూ ఏపీ హై కోర్టు తీర్పునిచ్చింది. ‘అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి’. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలి. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు అంటూ సంచలన తీర్పు ఇచ్చింది. ఇష్టప్రకారం శాసనాధికారాలను వినియోగించరాదు, సీఆర్డీఏ చట్టప్రకారం 6 నెలల్లో అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని, రాజధాని భూములను తనఖా పెట్టరాదని, అమరావతి అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని హైకోర్టు అదేశం ఇచ్చింది.
అమరావతి విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో 807 రోజులుగా జగన్ ప్రభుత్వంతో పోరాడుతున్న రైతులు గెలిచినట్టయింది. ఈ సందర్భంగా వెలగపూడి గ్రామానికి చెందిన రైతులు తమ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వారందరికీ పాదాభివందనాలు చేసి, సంబరాలు చేసుకున్నారు