షుగర్ వ్యాధి అనేది ఈ రోజుల్లో చాలా సర్వసాధారణమైపోయింది. చిన్న చిన్న పిల్లల్లో కూడా షుగర్ కంప్లైంట్ ఉండటం మనం చూస్తున్నాం. ముఖ్యంగా మారుతున్న ఆహారపుటలవాట్లు ఒక కారణమైతే వారసత్వంగా సంక్రమించడం మరో కారణంగా చెబుతారు. అలాగే తీవ్రమైన ఒత్తిడికి గురవడం కూడా షుగర్ విబారిన పడటానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. షుగర్ వ్యాధి రావడం మన చేతుల్లో అయితే లేదు, కానీ అది వచ్చాక మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకునేందుకు డాక్టర్ల సలహా మేరకు డైట్ లో చాలా మార్పులు చేయడం ఉత్తమం. అయితే రక్తంలో చక్కెరను నియంత్రించాలంటే మన ఆహారాలు అలాగే మనం తీసుకునే పానీయాల గ్లైసెమిక్ సూచిక చాలా ముఖ్యం.
మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉండే ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. దీనికి మంచి ఉదాహరణగా మునగ ను చెబుతున్నారు. మునగ లో యాంటీవైరల్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ ఇంకా జింక్ వంటి పలురకాల పోషకాలు ఉంటాయి.
కాబట్టి మునగను మన ఆహారంలో తరచుగా ఉండేలా చూసుకుంటే, షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవడానికి వీలవుతుంది అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో మునగకాయలను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అన్నది కూడా ఒక్కసారి చూద్దాం.
మునగ చెట్టు నుండి లభించే మునగ కాయలు, ఆకులు అలాగే మునగ పువ్వు వంటి అన్ని పదార్ధాలలో కూడా ఔషధ గుణాలను పుష్కలంగా ఉంటాయంటున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి, ముఖ్యంగా ఇందులో ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు ఉంటాయని. గ్లైకోసైడ్స్, క్రిప్టో క్లోరోజెనిక్ యాసిడ్ ,కెంప్ఫెరోల్ 3 ఓ గ్లూకోసైడ్ వల్ల మధుమేహం ప్రభావం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మీరు ఆహారంలో మునగను తీసుకోవడం వల్ల ఇది మన శరీరంలో ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి దోహదపడుతుందని అంటున్నారు. ఇక శరీరం యొక్క ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఒక రకమైన ఆహారం ప్రతి రోజు తినడం వల్ల ఎవరికైనా విసుగు కలుగుతుంది. అలాంటప్పుడు మునగ తో వివిధ రకాల్లో వంటను సిద్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకు మునగకాయ పులుసు, మునగకాడ పప్పు ఇలా అనేకరకాలుగా మునగాకు వండి వడ్డించవచ్చు. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏదైనా మితంగానే తినాలి, మంచిది కదా అని చెప్పి మోతాదుకు మించి తీసుకోవడం కూడా ప్రమాదమే, కాబట్టి మునగ ను మరీ ఎక్కువగా తింటే, శరీరంలో రక్తపోటు, హృదయ స్పందన రేటు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలకు మందులు వాడే వారు ముఖ్యనగకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
మునగకాయను ఆహారంలో ఎంత మోతాదులో తీసుకోవాలి అనే దానిపై మీ వైద్యులను సంప్రదిస్తే మంచిది.