ప్రస్తుత కాలంలో 30 ఏండ్లకే కాళ్ల నొప్పులు, షుగర్, బీపీ అంటూ బతకలేక బతుకుతున్నారు. కానీ 105 ఏండ్ల వయసులో కూడా ఓ బామ్మ తన పనులు తాను చేసుకుంటూ.. దర్జాగా బతుకుతోంది. వామ్మో.. ఈ వయసులో కూడా తన పనులు తాను చేసుకుంటుందా.. అసలు ఇంత కాలం బతికి ఉందా? అనే సందేహాలు వస్తున్నాయి కదా. అయితే ఇది నిజమే.. కరీంనగర్ జిల్లాలో ఓ 105 ఏండ్ల బామ్మ తన పనులు తాను చేసుకుంటూ, కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతోంది.
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన గాజుల నరసమ్మ మంగళవారం 105వ సంవత్సరంలో అడుగుపెట్టింది. దాంతో ఆమె పుట్టిన రోజును కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు. నరసమ్మ బర్త్ డేను ఓ ఫంక్షన్ చేశారు. బంధువులను, గ్రామస్థులను పిలిచి.. అందరికీ భోజనాలు కూడా పెట్టారు. కొడుకులు, కూతుర్లు, మనుమలు, మనమరాళ్లు, ముని మనుమలు, బంధు మిత్రుల సమక్షంలో నరసమ్మ కేక్ కట్ చేశారు. పిల్లలందరూ.. ఐదు తరాలకు పెద్దదిక్కుగా ఉన్న నరసమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు