జాతీయ పార్టీ ఏర్పాటుపై శరవేగంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికె)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రధానంగా జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత బిజెపి నుంచి ఎదుర్కొనాల్సిన పరిణామాలు, పర్యవసానాలు, రోడ్ మ్యాప్‌పై ప్రశాంత్ కిషోర్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. పార్టీని దేశవ్యాప్తంగా ఎలా విస్తరింప చేయాలి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి వ్యూహాలు రచించాలనే అంశంపై వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జాతీయ పార్టీ పేరు.. ఎజెండాతో పాటు ఎప్పుడు అధికారికంగా ప్రకటన చేయాలని అనే అంశాలపై కూడా పికె నుంచి పలు సూచనలు, సలహాలు సిఎం కెసిఆర్ స్వీకరించినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్, బిజెపి పాలనను చూసిన దేశ ప్రజలకు మనం పెట్టే జాతీయ పార్టీవైపు అందరి దృష్టిని పడేలా విధివిధానాలను రూపొందించాల్సిన అంశాలపై కూడా చర్చించారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రాల మధ్య తెగని నదీ జాలాల సమస్యతో పాటు ఆర్ధిక అంశాలను పరిష్కరించుకుందుకు త్వరలోనే రిటైర్డు ఎఐఎస్, ఐఎఫ్‌ఎస్‌తో పాటు ఇతర అధికారులతో ఒక సమావేశం నిర్వహించి వారి నుంచి కూడా సూచనలు.. సలహాలు తీసుకుని జాతీయ పార్టీని ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వారితో ఒక సమావేశం నిర్వహించాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి తేదీని మరో నాలుగైదు రోజుల్లో ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మరో వారం రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై కూడా పికెతో కెసిఆర్ చర్చించారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చేందుకు అవసరమైన వ్యూహాలపై పలు కోణాల్లో సమాలోనచలు చేసినట్లుగా సమాచారం. బిజెపితో యుద్ధం రాష్ట్రపతి ఎన్నికలతో మొదలుపెట్టాలని కెసిఆర్ ప్రధానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపియేతర పక్షాన ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎవరిని రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంశంపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి బలమైన ప్రత్యర్ధిని బరిలోకి దింపడం ద్వారా మోడీ ప్రభుత్వానికి చెమటలు పెట్టాలని భావిస్తున్నారు. పైగా ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధికి వ్యతిరేకంగా పోటీ పెట్టడం వల్ల బిజెపియేతర పార్టీలను మరోసారి ఏకం చేసేందుకు ఉపయోగపడుతుందని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఇదే విషయంపై ప్రశాంత్ కిషోర్‌తో చర్చించి తన వ్యూహాలకు మరింతగా పదునుపెడుతున్నారు. రాష్ట్రాల వారిగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే పార్టీల సంఖ్య ఎంత? వారికున్న ప్రజాప్రతినిధుల బలం ఎంత? తదితర అంశాలపై కూడా వారిద్దరు లెక్కలు వేసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రాన్ని దెబ్బకొట్టి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న కెసిఆర్…. ఇందుకు రాష్ట్రపతి ఎన్నికలే సరైన అవకాశంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూటికి నూరు శాతం రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి తన సత్తాఏమిటో చూపాలని తహతహలాడుతున్న కెసిఆర్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా పికె కూడా భరోసా తెలిపారని సమాచారం. కాగా పికె మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు సమాచారం. మొత్తం మీద రాష్ట్రపతి ఎన్నికలు మరోసారి బిజెపి, బిజెపియేతర పార్టీల శక్తిసామర్ధాలకు అగ్నిపరీక్షగా మారబోతున్నదని తెలుస్తోంది.