ఏపీ రాజకీయాల్లో అప్పుడప్పుడు వచ్చి సంచలనమైన ప్రెస్ మీట్లు పెట్టి..రాజకీయాలని మరింత ఆసక్తికరంగా మార్చే ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి మీడియా ముందుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం చేస్తున్న తప్పులని చెబుతూ సరిదిద్దుకోవాలని పరోక్షంగా జగన్‌కు సపోర్ట్ చేస్తున్న ఉండవల్లి..ఇప్పుడు మాత్రం సంచలన విషయాలని బయటపెట్టారు. ఏపీకి సంబధించిన విభజన అంశాల గురించి వదిలేయాలని సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ వేసిందని ఫైర్ అయ్యారు.
ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని, విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి జగన్‌కు భయం ఎందుకని, జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోందని చెప్పుకొచ్చారు. ఏపీకి అన్యాయం జరుగుతున్నా పోరాడకపోవడం వల్లే చంద్రబాబుకు 23 సీట్లు వచ్చాయని, ఇప్పుడు జగన్ పోరాటం చేయకపోతే…జగన్ రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడినట్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇన్నాళ్లకు ఏకపక్ష రాష్ట్ర విభజనపై కోర్టులో మాట్లాడగలిగే అవకాశం వచ్చిందని.. వచ్చే ఏడాది పిబ్రవరి 22వ తేదీన రాష్ట్ర విభజన కేసును విచారించాలా.. లేదా వదలివేయాలన్నది చూద్దామని, ముందు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ వేయాలని ధర్మాసనం తెలిపిందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం వదిలేయమని అఫిడవిట్ వేసిందని ఫైర్ అయ్యారు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కోర్టులో పోరాడాలని, అలా కాకుండా జగన్ ప్రభుత్వం వదిలేయమని కౌంటర్ వేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
అయితే ఉండవల్లి రాష్ట్ర విభజనపై పలుమార్లు గళం విప్పారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్..బీజేపీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కానీ వారు సొంత ప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగుతున్నారని ఫైర్ అవుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక విభజన హామీలపై కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేసిన సందర్భాలు లేవు. గతంలో చంద్రబాబు అయినా చివరిలో ధర్మపోరాటాలు అంటూ హడావిడి చేశారు. వైసీపీ అది కూడా లేదు. అందుకే జగన్ టార్గెట్ గా ఉండవల్లి ఫైర్ అయ్యారు.