ఎప్పుడైనా రాజకీయాలని రాజకీయంగానే ఫేస్ చేయాలి..పర్సనల్ జీవితాలని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు. కానీ ఏపీ రాజకీయాల్లో ఈ పరిస్తితి లేదు. పర్సనల్ జీవితాలపై కూడా రాజకీయం చేయడమే ఏపీ నేతలకు అలవాటైంది. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు..అందరూ అదే బడిలో ఉన్నారు. కాకపోతే ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి..ప్రత్యర్ధులని పర్సనల్ గా టార్గెట్ చేయడం మొదలైంది.
ఇక ఇప్పుడు ఆ రాజకీయం తీవ్ర స్థాయికి చేరుకుంది. అసలు వైసీపీ నేతలు..చంద్రబాబు, పవన్‌ల పర్సనల్ జీవితాలని బయటకు లాగి ఎలా విమర్శలు చేశారో చెప్పాల్సిన పని లేదు. ఇటు టీడీపీ వాళ్ళు సైతం జగన్ కుటుంబాన్ని పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇలా పార్టీలు కుటుంబాలని రాజకీయాల్లోకి లాగి విమర్శలు చేస్తున్నారు. అయితే అధినేతలు సైతం అదే తరహాలో కుటుంబాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అటు చంద్రబాబు అయిన, ఇటు జగన్ అయిన అదే పనిలో ఉన్నారు.
తాజాగా జగన్ మరోసారి పవన్ పెళ్లిళ్ల గురించి కామెంట్ చేశారు. ఇదివరకు కూడా పవన్ పెళ్లిళ్లపై జగన్ విమర్శలు చేశారు. తాజాగా కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్..చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే మరొక రాష్ర్టమని, దత్తపుత్రుడు మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని తాను అనుకోవట్లేదని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే రాజకీయ పరమైన విమర్శలు చేస్తే ఏమి ఉండదని, ఇలా భార్యల గురించి సీఎం స్థాయి వ్యక్తి విమర్శలకు దిగడాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు.
ఇక తెలంగాణలో కూడా టీడీపీ ఉంది కాబట్టి..అక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాలని బాబు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రజలు అంగీకరిస్తారా లేదా? అనేది ఎన్నికల్లో తేలుస్తారు. కానీ జగన్ సైతం గతంలో ప్రతిపక్షంలో ఉండగా హైదరాబాద్‌లోనే ఉండేవారు. అక్కడ నుంచే ఏపీకి వచ్చేవారు. ఆ విషయం పక్కన పెడితే..తనది ఇదే రాష్ట్రమని, 5 కోట్ల ప్రజలే తన కుటుంబమని, మరో 18 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని , తాను ఎవరినీ నముకోవట్లేదు అని, ప్రజలు, దేవుడిని నమ్ముకున్నానని అంటున్నారు. మరి జగన్‌ని మళ్ళీ ఏపీ ప్రజలు గెలిపిస్తారో లేదో చూడాలి.